దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇంటికి వెళ్ళాను. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మా అన్నయ్య కొడుకును ఫస్ట్ టైం చూడబోతున్నాను. వీటితో పాటు మా ఇంటి దగ్గర ఉండే కాలువలు, చెట్లు చూడబోతున్నాను అన్న ఆలోచనే నా గుండె వేగాన్ని పెంచేసింది.
మా ఊరు పసలపూడి. అపుడెపుడో అమలాపురం దగ్గర బ్లో అవుట్ వచ్చిన పాశర్లపూడి కాదు, అతడు సినిమా లో ఉన్న బాశర్లపూడి కాదు, వట్టి పసలపూడి. పాత సినిమాలలో ఉన్నట్లు ఊరి చివర నది, ప్రక్కనే కొండమీద గుడి, దాని ప్రక్కనే ధ్వజ స్తంభం ఉండవు కాని, మా ఊరు చాలా బావుంటుంది. గోదావరి నది నుండి విడిపోయిన ఒక కాలువ, దాని ప్రక్కనే ఆంజనేయ స్వామి గుడి, ఊరి లోకి ఈ మధ్యనే కొత్తగా వేసిన సిమెంట్ రోడ్. మా ఇంటికి వెళ్ళాలి అంటే కాలువను దాటుకుని, లాకుల లోంచి వెళ్ళాలి.
బస్సు దిగి నడుస్తుంటే “పసలపూడి లాకులు, ఆయకట్టు XXXX” అని పసుపు రంగు బోర్డ్ మీద రాసి ఉంటుంది. అది దాటుకుని ముందు ఒక చిన్న వంతెన దాటాలి. దీనిని వైర్ వంతెన అంటారు. మా చిన్నప్పుడు ఇది చెక్కతో ఉండేది. నడుస్తున్నపుడు క్రింద కాలువ కనిపించి భయం వేసేది. ఇక్కడ ఒక వల కట్టి ఉంది. చేపలు ఎగురుతూ అపుడపుడూ ఈ వలలో దూకితే అది చూడడం భలే గా ఉండేది. ఇది దాటి ముందుకు వెళితే ఒక ప్రక్క లాకు సూపరిండెంటు, కళాసీల ఇళ్ళు, లాకు ఆఫీసు, మరో ప్రక్క చెట్లు ఉంటాయి.

ఈ దారి నుండి రాత్రి పూట వెళ్ళాలి అంటే నాకు ఇప్పటికీ చాలా భయం. లైట్లు ఉండవు. పాములు అటు, ఇటూ తిరిగేస్తూ ఉంటాయి. మరో ప్రక్క వందల కాలం నాటి చింత చెట్లు అంతెత్తున జుట్టు విరబోసుకుని బయపెడుతూ ఉంటాయి. అదీ కాక, దయ్యాలు చింత చెట్ల మీదే కాపురం ఉంటాయట. నాకు తెలిసి నేను ఎప్పుడూ రాత్రి పూట వంటరిగా ఈ దారిలో రాలేదు.
ఇదీ లాకు ఆఫీసు. బాగా పాతది అయిపోయింది. దాని వెనకాలే కళాసీ ల క్వార్టర్స్ ఉంటాయి. అవి ఇంకా పాతవి. ఉండడానికి ఏమాత్రం తగినవి కావు. ఇక్కడ ఒక సూపరిండెంటు, ఇద్దరు కళాసీలు ఉండొచ్చు. ఒకప్పుడు వీటి నిర్వహణ బావుండేది. ఇప్పుడు అంత బాలేదు. చుట్టూ నీరు, చెట్లు, పాములు, పురుగులు. అమ్మో, భయం వేస్తుంది.
మా భాసిమామ చెబుతూ ఉండేది – ఈ లాకులు తవ్వే సమయం లో సర్. ఆర్థర్ కాటన్ గుర్రం మీద తిరుగుతూ పని ఎలా జరుగుతుందో చూస్తూ ఉండేవాడట. కొంత కాలం క్రితమే ఇక్కడ ఆయన విగ్రహం పెట్టారు. లాకు లోపల చెట్లు చాలా ఉంటాయి. ఇది పార్క్ కాదు గాని అలా చేయకపోతేనే బావుంటుంది, కనీసం ఈ చెట్లయినా మిగిలి ఉంటాయి.
ఇంకొంచం ముందుకు వెళితే మరో వంతెన వస్తుంది. చిన్నప్పుడు పిల్లలంతా అంత ఎత్తు నుండి దూకుతూ ఎంజాయ్ చేసేవారు. ఇంకొకటి ఏమిటంటే ఒకప్పుడు ఈ కాలువ లోంచే ఇసుక పడవలు వెళ్ళేవి. కాని రోజులు మారి పోయాయి. కాలువ లో పూడిక పెరిగిపోయింది. నీరు తక్కువ అయిపోయింది.
ఇక్కడ నిలబడి చూస్తే రామచంద్రాపురం దగ్గర వంతెన కనిపించేది. ఈ కాలువ అలాగే వెళ్లి కాకినాడ దగ్గర సముద్రం లో కలుస్తుంది. నా చిన్నప్పడు మా అన్నయ్య మునిగిపోతుంటే రాజు అని నా ఫ్రెండ్ బయటకు లాగాడు. నేనేమో గట్టు మీద నిలబడి చప్పట్లు కొడుతున్నాను. నాకేం తెలుసు తను మునిగిపోతున్నాడని. అప్పటి నుండి మా అన్నయ్య కాలువ లో దిగితే ఒట్టు. ఇప్పటికి మా ఇద్దరికీ ఈత రాదు. ఇంటి ప్రక్కన కాలువ పెట్టుకుని ఇప్పటి వరకూ ఈత నేర్చుకోకపోవడం సిగ్గు చేటు.
అదీ సంగతి. ఇదీ నేను పుట్టి, పెరిగిన ఊరు, ఊరి లో కాలువ గురించి కొన్ని విశేషాలు. మా ఇల్లు చెల్లూరు ఊరి శివారు లో ఉంటుంది. చుట్టూ వరి, చెరకు పొలాలు. సూపర్ ఉంటుంది.
ఫైనల్ గా మా ఇంటి దగ్గర కాచిన ఒక అందమయిన పువ్వు.
బాగుందండి మీ ఊరు. పువ్వు కాచదు. పూస్తుంది.
అవునండీ, మా ఊరివే.
అతడు గారూ…,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
వంశీ పసలపూడి కథలు మీ వూరివేనా?