ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ పూసేది, విరగ కాసేది. కాని మనకు ఇంటి పచ్చడి ఉండేది కాదు.
మా ఊరి మొదట్లో గోపాలరావు హోటల్ ఉండేది. ఉగాది పొద్దున్నే లేచి, గ్లాసు పట్టుకుని పరిగెత్తే వాళ్ళం పచ్చడి కోసం. గ్లాసు నిండుగా ఇచ్చేవాడు. అది భలే ఉండేది. తియ్యగా, చేదుగా, చిక్కగా. అందులో వేసే పచ్చి సెనగపప్పు, మామిడికాయ ముక్కలు నములుతుంటే బావుంటుంది. ఇంట్లో అందరికీ ఏదో పచ్చడి తిన్నారు అనిపించడానికి కొంచం, కొంచం చేతి లో రాసి, మిగతాది అంతా నేను తినేసేవాడిని. అదేదో సినిమాలోలా బాల కృష్ణ గంపలో కూర్చుని బొమ్బుడెల పులుసు తినేస్తాడు, నిర్మలమ్మకు, వాళ్ళ చెల్లికి చేతి మీద కొంచం రాసి.
ఇప్పుడు ఉగాది లేదు, పచ్చడి లేదు. ఈ సంవత్సరం నాకు ఆ అదృష్టం లేదు అనుకుంటాను.
Leave a comment