భూపతి పాలెం కథలు

ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి …

అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత – రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం లో నేతాజీ సుబాష్ చంద్ర బోస్ కు పర్సనల్ డాక్టర్ గా ఉన్నారు. తరువాత, రాజమండ్రి వచ్చి ఇక్కడ వారికి ఏమి అన్నా చేద్దాం అని స్కూల్ పెట్టారు. ప్రభుత్వం దానిని గురుకుల స్కూల్ గా చేసింది. ఆంధ్ర పదేశ్ కో ఉన్న గురుకుల స్కూళ్ళు అన్నిటిలో ఇది టాప్. అటువంటి చోట చదవడం నా అదృష్టం గా ఫీల్ అవుతుంటాను అపుడపుడు.

భూపతిపాలెం రాజమండ్రి దగ్గర ఉన్న ఏజెన్సీ లో ఉంటుంది. స్కూల్ చుట్టూ దట్టమయిన అడవులు. కొంచం దూరం గా పిల్లలు, టీచర్లు, వంట వాడు, బార్బర్ వీళ్ళందరూ ఉండడానికి హాస్టల్. విశాలమయిన, ఒక చివర నుండి చూస్తే రెండవ చివర కనిపించనంత పెద్ద ప్లే గ్రౌండ్. అపుడపుడూ పిల్లలను పలకరించడానికి వచ్చే ఎలుగు బంట్లు, పాములు, ఇతర అడవి జంతువులూ. ఇదీ స్కూల్ పరిచయం. ప్రకృతి ఒడి లో నేర్చుకున్న పాఠాలు, ఆడిన ఆటలు, ఆ పరిసరాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఒక రావి చెట్టు ఉండేది. ప్రతీ వారం తెలుగు పీరియడ్ లో క్లాసు అందరం దాని దగ్గర చేరేవాళ్ళం. ఎవరో ఒక కవినో, రచయిత నో తీసుకుని వాళ్ళ గురించి, వాళ్ళ వర్క్ గురించి చెప్పాలి. కవితలు అల్లాలి.

మా పీ.డి. ఉండేవాడు. మహా చండశాసనుడు. ఆయన ఇంటి ముందు ఒక సైజు లో కొబ్బరి చెట్టు ఉండేది. మరీ అంత ఎత్తు కాదు గాని, ఒక మోస్తరుగా, నిండు కాయలతో బరువుగా ఉండేది. మా క్లాసు లో ఉన్న ముగ్గురు ఆకతాయి ల కళ్ళు వాటి మీద పడ్డాయి. ఒక రోజు అర్ద రాత్రి ముహూర్తం పెట్టారు. చుట్టూ చీకటి. లైట్ లు లేవు. అడవి జంతువుల ఆరుపులు. ముగ్గురూ చెట్టు దగ్గరకు చేరారు. మాంచి దిట్టం గా ఉన్నోడు చెట్టెక్కాడు. ఇంకొంచం పైకి … అందడం లేదు. చివరి కంటా ఎక్కేసాడు. సరిగా కాయలు దించే వేళ వాడి బరువుకి చెట్టు తల బాగం విరిగి పోయింది. వాడు పడిపోయాడు. అదృష్టం, శబ్దం వచ్చినా ఇంట్లో అలికిడి లేదు. ముగ్గురికీ ఉచ్చ్చ కారిపోయింది. ఇప్పుడెలా ? అసలే మాస్టారు మహా క్రూరుడు. ఈ పని ఎవరూ చేసారో అని పసి గట్టేస్తాడు. ఇంతకు ముందే అతడి బండి పెట్రోలు తనకు లో పంచదార పోసినందుకు ఆల్రెడీ చేతులు విరగ్గోట్టించుకుని ఉన్నవాళ్ళు. ముగ్గురిలో ఒకడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. స్కూల్ గ్రౌండ్ దగ్గర అలాంటి సైజు ఉన్న కొబ్బరి చెట్టు ఉంది. దానిని తీసుకు వచ్చి పాతేస్తే ???

పిచ్చోడిని చూసినట్లు చూసారు మిగతా ఇద్దరు. ఇది సాధ్యం అయ్యేనా ? కొబ్బరి చెట్టు వ్రేళ్ళు భూమి లోపల బాగా లోతుకు వెళ్లి పోయి ఉంటాయి . ఇక్కడ దీనిని తవ్వి, అక్కడ దానిని తవ్వి, అక్కడ నుండి తీసుకు వచ్చి ఇక్కడ పాతడం అయ్యే పనేనా ? ఒక వేళ పాతినా అది బ్రతుకుతుందని నమ్మకం లేదు. కాని వేరే దారి లేదు. హాస్టల్ కు వెళ్లి మరో ఇద్దరినీ లేపి, ఆ అర్ద రాత్రి కొత్త చెట్టుని పాతేసారు. ఈసురో మంటూ హాస్టల్ కు వచ్చి తెల్లవారు జామున పడుకుండి పోయారు. ఆశ్చర్యం !! మరుసటి రోజున మాస్టారుకి అనుమానం ఏమి రాలేదు. బ్రతకదు అనుకున్న ఆ కొబ్బరి చెట్టు కొన్ని రోజులకి విరగ కాయడం మొదలెట్టింది.

చెట్టుకి ముగ్గిన పనస పండు వెదజల్లే సువాసన అంతా, ఇంతా కాదు. మా స్కూల్ చుట్టూ ఉన్న అడవిలో చాలా పనస చెట్లు ఉండేవి. ఏ చెట్టు కాయలు పండుతాయి, ఎప్పుడు తినొచ్చు అన్నది చూసేందుకు సర్వే చేస్తూ ఉండేవాళ్ళం. మా స్కూల్లో చాలా గ్రూపులు ఉండేవి, అలానే మా క్లాసు లో కూడా. బండి పోటు దొంగల్లా ఒక గ్రూపు ఆస్తులు వేరే గ్రూపు లు దొంగతనం చేస్తూ ఉండేవి. మా పనస పళ్ళు వేరే గ్యాంగ్ కంట పడకుండా చేయడం మహా కష్టం. దాని కోసం, పండు పాడవకుండా కాగితం చుట్టి, గొయ్యి తీసి, ఎవరికీ అనుమానం రాకుండా పైన ఆకులు, మట్టి వేసి దాచేవాళ్ళం. ఇంత చేసినా ఎవడో ఒకడు పసిగట్టేసేవాడు. అలానే జీడి పిక్కల ఏరివేత కార్యక్రమం. ఎలుగు బంట్ల కు జీడి పళ్ళు అంటే మహా ఇష్టం. పండుని పండు లానే మింగేస్తాయి, క్రిందనున్న పిక్కతో సహా. కాని అది అరగదు. ఎలుగు బంటి తిన్న తరువాత వాటర్ ఎక్కడుందో అక్కడకు వెళ్తుంది. అలానే మాకు తెలుసు మేమెక్కడికి వెళ్ళాలో. చుట్టూ పక్కల నీరు ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు కాబట్టి, అన్నీ వెతికేవాళ్ళం. దాని పేడ దొరకగానే మాకు పండగే, పండగ. పేడను వెతికి జీడి పిక్కలు సంపాదించేవాళ్ళం.

ఇలాంటివి ఎన్నెన్నో …

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑